న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఈ సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు తారలు కూడా రెడీ అయిపోయారు. కొన్ని గంటల పాటు పెర్ఫామెన్స్ ఇచ్చి లక్షలు.. కోట్ల కొద్దీ మొత్తాన్ని జేబులో వేసుకునేందుకు ఇంతకంటే మంచి తరుణం వారికి దొరకదు. మాజీ పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా కర్నాటకలో ఇలాగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెడీ అయింది. కానీ సన్నీకి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనలు జరుగుతున్నాయి. బెంగళూరులో నిర్వహించనున్న నూతన సంవత్సర వేడుకల్లో ఆమె సందడి చేయనున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం నగరంలోని మాన్యతా టెక్ పార్కు ఎదుట ఆందోళన చేపట్టారు. సన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ సంస్కృతిని అవమానించడమంటూ ఆమె ఫొటోలకు నిప్పంటించారు.
అంతేకాదు ఈ నూతన సంవత్సర వేడుకను ఆపకపోతే యువసేన సంఘం కార్యకర్తలు డిసెంబరు 31న ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ.. ‘సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే.. వెళ్లండి, చూడండి. సన్నీకి గతం బాగోలేదు. ఇలాంటి వారిని మేం ప్రోత్సహించం. డిసెంబరు 31న ఆత్మహత్యకు పాల్పడటానికి మేం ఏ మాత్రం సంకోచించడం లేదు’ అని అన్నారు.
ఈ వివాదంపై కార్యక్రమ నిర్వాహకుడు స్పందిస్తూ.. ఇది ఓ కుటుంబ వేడుక లాంటిదని, సన్నీ కన్నడ పాటకు డ్యాన్స్ చేయబోతున్నారని చెప్పారు. ‘బెంగళూరుకు చెందిన నేను.. ఇక్కడి సంస్కృతికి తగినట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నా. సన్నీకి దీని కంటే పెద్ద ఆఫర్లు వచ్చాయి, కానీ, ఆమె వాటిని కాదని బెంగళూరుకు రావడానికి ఒప్పుకొన్నారు. ఎందుకంటే.. బెంగళూరు, హైదరాబాద్ ఆమెకు చాలా ఇష్టమైన ప్రదేశాలు. ఆందోళనకారులు ఏం కోరుకుంటున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. ఇది ఓ కుటుంబం వేడుక.. దీని వల్ల రాష్ట్ర సంస్కృతికి ఎటువంటి అవమానం జరగదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.