TTD:వైభవంగా కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

27
- Advertisement -

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 7.40 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. కంకణభట్టర్‌ శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, కంకణభట్టర్ శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. మార్చి 8న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని చెప్పారు. మార్చి 9న కల్యాణోత్సవం, మార్చి 10న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -