అగస్టు 15న “కంటి వెలుగు” ప్రారంభం-కేసీఆర్

209
- Advertisement -

కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం “కంటి వెలుగు” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పంద్రాగ‌స్టున‌ మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అగస్టు 15 న ప్రారంభించనున్న కంటివెలుగు కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కార్యక్రమ నిర్వహణలో సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలు తదితర అంశాల గురించి అధికారులు పూసగుచ్చినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయితీల వారిగా చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొత్తం 812 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

KCR

ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవాదాయి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేశ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, శాంతి కుమారి, కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, డైరక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపుడుతున్న వివిధ వయస్సులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటివెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కంటి పరీక్షలు, కంటి అద్దాలు, అవసరమైన వారికి జరిపే కంటి శస్త్ర చికిత్సలు, మందులు తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి ఉచితంగా అందజేయనున్నట్టు సీఎం తెలిపారు. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించనున్నారని తెలిపారు.

KCR

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిధిగా తీసుకుని గ్రామాల్లో, వార్డును పరిధిగా తీసుకుని పట్టణాల్లో, కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. కంటివెలుగు క్యాంపులో, ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఎఎన్ఎంలు సూపర్ వైజర్లు, ఆశా వర్కర్లు తదితర ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం ప్రజలకు సేవలందిస్తుందన్నారు. వీరికి పూర్తిస్తాయి వాహనాన్ని ఏర్పాటు చేస్తారు.

ఒక్కో క్యాంపులోని వైద్య బృందం ప్ర‌తి రోజు గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో కేవలం 40 శాతం మందికి మాత్రమే వైద్యం అవసరమవుతుందనే విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 గురు వైద్య అధికారులు కంటి వైద్య నిపుణులను అందుబాటులో వుంచనున్నామని, మొత్తంగా 812 వైద్య బృందాలు తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలు అందిస్తున్నట్లు అధాకారులు సీఎంకు తెలిపారు.

KCR

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీ తయారు చేసిన నాణ్యమైన కంటి అద్ధాలను అందుబాటులోకి తెచ్చామని, ఐదు నెలలపాటు నిర్వహించనున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ వైద్య బృందాలు మరింత నాణ్యమైన పనివిధానాన్ని కనపరిచేందుకు వారానికి రెండు రోజులు వారాంతపు సెలవులు ఇవ్వాలన్నారు. ఈ వైద్య బృందాలు అందించిన చికిత్సానంతర ఫాలోఅప్ కోసం స్థానికంగా అందుబాటులో వున్న ప్రయివేటు ప్రభుత్వ ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న దవాఖాన్లను గుర్తించాలన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన మేరకు తాత్కాలిక పద్దతుల్లో ఉద్యోగులను నియమించుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణలో కంటి చూపు సమస్యలతో ఏఒక్కరూ బాధపడకుండా చూడాలనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న కంటివెలుగు పథకాన్ని విజయవంతం చేయాలని, అందుకు గాను ప్రజాప్రతినిధులను వివిధ స్థాయిల్లోని సామాజిక కార్యకర్తలను బాధ్యతగల పౌరులను కలుపుకు పోవాలని, సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -