బాహుబలి.. బంద్‌ !!

219
Kannada groups threaten to Baahubali 2 release
Kannada groups threaten to Baahubali 2 release
- Advertisement -

బాహుబలి-2 కన్ క్లూజన్’ సినిమాను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని, పక్కా ప్రణాళికతో భారీ ప్రచారం నిర్వహిస్తున్న రాజమౌళికి కన్నడనాట షాక్ తప్పేలా కనిపించడం లేదు. తమిళనటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ‘బాహుబలి– ది కన్‌క్లూజన్‌’ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఏప్రిల్‌ 28న బాహుబలి రిలీజ్‌ కానున్న వేళ ‘కన్నడ ఒకోటా’ సంస్థ బెంగుళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. ఒకోటా అధ్యక్షుడు వతల్‌ నాగరాజ్‌ మాట్లాడుతూ.. కావేరీ జలాల విషయంలో కన్నడిగుల గురించి గతంలో సత్యరాజ్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు హద్దులు దాటయన్నారు. బాహుబలి2 చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో విడుదల కానివ్వమని …. మా కార్యకర్తలు ప్రతి జిల్లాలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారన్నారు. కాదు కూడదని రిలీజ్‌ చేస్తే ఎగ్జిబిటర్లు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నాగరాజ్‌ హెచ్చరించారు. ఈ ఆందోళనకు కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు తెలిపింది. దీంతో కన్నడలో బాహుబలి విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కన్నడలో మాట్లాడి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సినిమాను అడ్డుకోవడం సరికాదన్నారు. ఆ సమయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్న రాజమౌళి.. వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సినిమా కోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఐదేళ్లుగా కష్టపడి పని చేశారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి రెండో భాగాన్ని కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -