కన్నడ నటుడు అంబరీష్ (66) మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మండ్య జిల్లా మద్దూరు తాలూక దొడ్డరకినకెరె గ్రామంలో 1952 మే 29న ఆయన హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు జన్మించారు. ఆ దంపతుల ఏడుగురు సంతానంలో ఆయన ఆరవ వారు. అసలు పేరు గౌడా అమర్‌నాథ్.
1991లో సినీ నటి సుమలతను వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ ఒక్కడే కుమారుడు. 1972లో ప్రఖ్యాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ రూపొందించిన ‘నాగరాహవు’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. అంబరీష్ కన్నడతో పాటు తమిళం, మలయాళం, హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. కన్నడ రెబల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన 200పై చిలుకు చిత్రాల్లో నటించారు.
2013లో కాంగ్రెస్ తరపున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఆయన మొదటిసారి 12వ లోక్‌సభలో ఎంపీగా ప్రవేశించారు. ఆ తరువాత 13, 14వ లోక్‌సభల్లో సభ్యునిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంబరీష్ మృతితో కన్నడ చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నివాళులర్పించేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.