ఆయన భరోసాతోనే అంగీకరించాను- కంగనా

75
Kangana Ranaut

నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కించిన చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ జయలలితగా, అరవింద్‌ స్వామి ఎంజీఆర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

ఈ వేడుకలో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. ‘తలైవి’చిత్రంలో జయలలిత పాత్ర చేయడానికి నేను వెనుకాడితే విజయేంద్రప్రసాద్‌ గారు నచ్చచెప్పి ఒప్పించారు. ఇంతగొప్ప చిత్రంలో జయలలిత పాత్రకు నా పేరు సూచించిన విజయేంద్రప్రసాద్‌ గారికి రుణపడి ఉంటాను. ఆయన ఇచ్చిన భరోసాతోనే ఈ చిత్రం అంగీకరించాను’’ అని నటి కంగనా రనౌత్‌ అన్నారు. సినిమా చూశాక విజయేంద్ర ప్రసాద్‌ గారు నాపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకున్నానని అనిపించింది. ఏ చిత్ర పరిశ్రమలోనూ ఇప్పటిదాకా ఒక మహిళా ప్రాధాన్య చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించలేదు. విష్ణువర్ధన్‌ పుట్టిన రోజుకు ‘తలైవి’ చిత్రం బ్లాక్‌బ్లస్టర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అవుతుంది. అరవింద్‌ స్వామి గారు ఎలాంటి బేషజం లేకుండా ఒక మహిళా ప్రాధాన్య చిత్రంలో నటించినందుకు ధన్యవాదాలు. ఎమ్జీఆర్‌ పాత్రలో ఆయన్ను తప్ప వేరేవాళ్లను ఊహించలేం. కరోనా సంక్షోభం తర్వాత థియేటర్లలోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని ప్రేక్షకులను కోరారు.