రజనీతో కలిసి నటిస్తా…

332
Kamal with Rajini
- Advertisement -

రజనీకాంత్, కమల్ హాసన్‌ పరిచయం అక్కర్లేని పేర్లు. ఎవరికి వారే సాటి. ఒకరు తమిళ సూపర్ స్టార్ అయితే మరొకరు సినీ లెజెండ్. వీరిద్దరి సినిమాలు వస్తే అభిమానులకు కన్నుల పండగే. అలాంటిది వీరిద్దరు కలిసి నటిస్తే బాక్సాఫీస్ షేకే. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడతారు. ఎందుకంటే బాక్సాఫీసు కాసుల వర్షంతో తడిసి ముద్దవ్వాల్సిందే. ఇది ఈ సూపర్ స్టార్ స్టెమీనా.

గతంలో వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ రోజులు తిరిగిరానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసనే వెల్లడించాడు. జల్లికట్లుపై తమిళనాడు వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కమల్ ‘రజనీ, నేను కలిసి నటిస్తాం. కానీ మమ్మల్ని ఎవరు భరిస్తారు’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

గతంలో వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. కమల్‌ కథానాయకుడిగా నటిస్తే రజనీ ప్రతినాయకపాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. వెండితెరపై వీరు నటిస్తుంటే ఆ పోటీయే వేరుగా ఉండేది. 1975లో తొలిసారి ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంలో కలిసి నటించారు. చివరిగా 1985లో ‘గిరఫ్తార్‌’లో నటించారు. ఇందులో అమితాబ్‌ కూడా నటించడం విశేషం.

 Kamal with Rajini

రజనీ, కమల్‌ కలిసి రెండు తెలుగు, ఒక హిందీ, తొమ్మిది తమిళ చిత్రాల్లో నటించారు. కాగా కమల్ హాసన్ వల్లే రజనీకాంత్‌కు సినిమాల్లో అవకాశాలు లభించాయని పలు ఇంటర్వ్యూల్లో రజనీకాంత్ చెప్పారు. 16 వయదినిలేలో విలన్ ఛాన్సు కూడా కమల్ ద్వారానే తనకు లభించిందని రజనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్‌హాసన్‌ ‘శభాష్‌ నాయుడు’ చిత్రంలో నటిస్తుండగా, శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ‘2.0’లో నటిస్తున్నారు.

ఇటీవలె ఈ ఇద్దరు స్టార్లు రహాస్యంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతేగాదు దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తమ అభిమాన నటులను చాలారోజుల తర్వాత ఒకే ఫొటోలో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. వికటన్‌ అవార్డుల వేడుకలో రజనీ.. కమల్‌కు జీవితసాఫల్య అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -