గౌతమితో వ్యవహారంపై తాను ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని…కొంతమంది సోషల్ మీడియాలో తన పేరుతో అనాగరికతతో వ్యవహరిస్తున్నారని కమల్ మండిపడ్డారు. కమల్‌తో విడిపోతున్నట్లు నటి గౌతమి మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనపై కమల్‌హాసన్ స్పందించలేదు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కమల్ .‘ఆమెకు ఏది సౌకర్యమో అది నాకూ సమ్మతమే. ఇప్పుడు నా భావాలు ముఖ్యం కాదు. ఏదేమైనా గౌతమి, సుబ్బు (కుమార్తె) సంతోషంగా ఉంటే చాలన్నారు.
గౌతమికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనుంటా. నాకు ముగ్గురు కుమార్తెలు- శ్రుతిహాసన్, అక్షర, సుబ్బులక్ష్మి. ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడైన తండ్రిగా నన్ను నేను భావిస్తున్నా’ అని కమల్ తెలిపాడు.
రెండు రోజుల క్రితం గౌతమి ప్రకటనపై కమల్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, కమల్ స్పందించినట్లుగా బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ఓ ప్రకటన హల్‌చల్ చేసింది. అందులో సున్నితమైన అంశాలను ప్రస్తావించడంతో కమల్ ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీంతో కమల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
మరోవైపు కమల్ – గౌతమి విడిపోవడానికి కారణం శ్రుతిహాసనేనంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె గౌతమిని విమర్శించినట్లు వదంతులు వ్యాపించాయి. ఆ వార్తలపై శ్రుతి తన మేనేజర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ… ‘నేను ఎవరి వ్యక్తిగత జీవితం గురించి, వారి నిర్ణయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాకు నా తల్లిదండ్రులు, సహోదరి, నా కుటుంబంపై అభిమానం, ప్రేమ, గౌరవ మర్యాదలు మాత్రమే ప్రధానం’ అని పేర్కొంది.
మరోవైపు తాను, కమల్ హాసన్ విడిపోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన గౌతమి… కమల్‌హాసన్ నటిస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొనసాగడానికి తనకు అభ్యంతరం లేదని గౌతమి చెప్పారు. కమల్ నటన అంటే తనకెంతో ఇష్టమని, ఆయన ప్రతిభ మీద తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.