కమల్ హాసన్ నటిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోపై తమిళ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కమల్ హాసన్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థే నన్ను కాపాడుతుంది. నన్ను అరెస్టు చేయాలని కోరుతున్న వాళ్ల బెదిరింపులకు భయపడనని తెలిపారు.
సామాజిక కార్యకలాపాలపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన ‘సత్యమేవ జయతే’ వంటి షో చేయొచ్చు కదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘సత్యమేవ జయతే కార్యక్రమాన్ని డబ్బు ఆర్జించడం కోసం చేశారు. నాకు ఆ అవసరం లేదు. నేను గత 37 సంవత్సరాలుగా సంక్షేమ సంఘాల ద్వారా నేను సేవ చేస్తూనే వస్తున్నా’ అని చెప్పారు.
కమల్ హోస్ట్‌గా వస్తున్న సెలబ్రెటీ రియాల్టీ షో బిగ్‌బాస్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ షో పేరిట తమిళ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ హెచ్ఎంకే (హిందు మక్కల్ కట్చి) సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇది తమిళ సంస్కృతి సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని కమల్ తక్షణం ఆ షోలోపాల్గొనడం ఆపేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి.
ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలు ఒవియా, నమిత, గంజా కరుప్పు, హారతి లను అరెస్టు చేయాలని ఆ సంఘం కోరింది.. బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న అభ్యర్ధులు 75 శాతం నగ్నంగా కనిపిస్తున్నారని.. మాటల్లో రాయలేని భాష వినియోగిస్తున్నారని హిందూ మక్కల్ కచ్చి అంటోంది. ఈ షో వల్ల ఏడుకోట్ల తమిళుల మనోభావాలు దెబ్బ తింటాయని హిందూ మక్కల్ కచ్చి ఆరోపిస్తోంది. స్టార్ విజయ్ ఛానెల్ లో జూన్ 25న ఈ షో ప్రసారం అయింది. ఈ షోతోనే కమల్ తొలిసారిగా టివిరంగంలో అడుగు పెట్టారు.