కమల్‌హాసన్ తన నటన, పాత్రలతో ఎల్లలు లేని అభిమానులను సొంతం చేసుకుని ‘లోకనాయకుడు’ అనిపించుకున్నారు. వెండితెరపై ప్రయోగాత్మక పాత్రలకి ప్రాణం పోసిన వారాయన. కొత్తదనానికి కొత్త దారులు తెరచిన కమల్, ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయిపోయాడు.
టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు కాలుమోపని కమల్‌కి కూడా ఒకసారి అదెలా వుంటుందో చూడాలనే కోరిక వుండిపోయిందట. అందుకే తాను తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షో చేయడానికి ఒప్పుకున్నాను అని తెలిపారు కమల్.
హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ షోని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని తమిళంలో కమల్ హాసన్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ షో రేపటి నుంచే ప్రసారం కానుంది. 14 మంది పార్టిసిపెంట్స్ పాల్గొంటున్న ఈ షో కోసం సెట్టింగ్ రెడీ అయిపోయింది. రానున్న 100 రోజులపాటు ఈ పార్టిసిపెంట్స్ అదే నివాసంలో వుండనున్నారు. విజయ్ టీవీ ఛానెల్ ప్రసారం చేయనున్న ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైపోయింది.
నిన్ననే ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ అందరూ ఈ హౌజ్ సెట్టింగ్‌కి చేరుకున్నారు. అంతకన్నా ఓరోజు ముందుగానే బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వహణ ఎలా వుండనుందనే వివరాలని మీడియా వారికి ఓ ట్రయల్ సెషన్ ద్వారా చూపించారట తమిళ బిగ్ బాస్ షో నిర్వాహకులు.
అయితే తాజాగా ఓ వెబ్‌పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ‘రియాలిటీ షో అనేది ఇప్పటివరకు తన జీవితంలో రియాలిటీ కాలేదు’ అని తనదైన స్టైల్లో సరదాగా వ్యాఖ్యానించారు కమల్. అంతేకాకుండా హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్‌ని సైతం ప్రశంసించారు కమల్.
ఇక నాలుగేళ్ల వయస్సు నుంచే వెండితెరపై మకుటం లేని మహారాజులా వెలుగొందిన కమల్ హాసన్ మొదటిసారి బుల్లితెరపై చేస్తున్న ఈ ప్రయత్నానికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఆల్ ది బెస్ట్ కమల్ హాసన్.