నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి కోసం తల్లిందండ్రులు పడరాని పాట్లు పడుతుంటారు. ఇలాంటి పేద ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రతి పేదింటికి పెద్దకొడుకులా మారి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నిర్ణయించారు. అందుకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
ఈ స్కీం కింద మొదట రూ. 51 వేలు అందించగా, ఆ తర్వాత రూ. 75 వేలకు పెంచారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల 65వేల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు. ఇప్పుడు ఈ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీం ఆర్ధిక సాయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్ . ఈ నిర్ణయాన్ని శాసనసభ వేదికగా ఈరోజు ప్రకటించారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ. 1,00,116 లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పెళ్లిళ్లు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారు. పరిపాలనలో అడుగడుగునా మానవీయ విలువలు ప్రతిబింబించాలని భావించి.. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థికంగా అండదండగా నిలువాలని కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం అని సీఎం తెలిపారు. ఈ పథకం వ్యక్తిగతంగా తన హృదయానికి దగ్గరైన పథకమని జనం మెచ్చిన పథకం అని సీఎం పేర్కొన్నారు.