టాలీవుడ్లో మెగా స్టార్ నాటిన మొక్క మెగా ఫ్యామిలీ వృక్షంగా విస్తరించింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , అల్లు శిరీష్ ,నిహారిక వంటి వారు మెగా స్టార్ వేసిన బాటలో నడుస్తున్నారు. ఎవరికి వారు ఇండస్ట్రీలో నిలబడడానికి, తమ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చిరంజీవి కూతుళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో కుదురుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద కూతురు సుస్మిత ఇప్పటికే తన తండ్రి నటించిన జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నెం 150 చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. చిన్న కూతురు శ్రీజ కూడా ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తుంది. కట్ చేస్తే చిరు చిన్నల్లుడు కళ్యాణ్ కూడా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం గతేడాది కళ్యాణ్ అనే వ్యక్తితో జరిగిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ సినిమా హీరో అవ్వాలనే కోరిక చిరంజీవి చెవిన వేసారని, అల్లుడి మాటను కాదనలేక… చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందుకోసం కల్యాణ్‌ను యాక్టింగ్ క్లాసులకు వెళ్లాలని, ఫిజిక్ విషయంలో కూడా మార్పులు చేసుకోవాలని చిరంజీవి సలహా ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వినిపించింది. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ మరో వార్త హల్ చల్ చేస్తోంది.
ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కల్యాణ్ పాల్గోన్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు మావయ్యల మధ్య కల్యాణ్ వెలిగిపోతున్నాడని, హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం కల్యాణ్ ఇండస్ట్రీ ఎంట్రీ పక్కా అని తెలిసింది. రీసెంట్గా కల్యాణ్‌పై ఓ ఫోటో షూట్ కూడా నిర్వహించినట్టు సమాచారం. అల్లుడి గారి అరంగేట్రం కోసం మావయ్య చిరంజీవి, రామ్ చరణ్‌లు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్టు సమాచారం. మెగా ఫ్యామిలీలో భాగమైపోయిన కళ్యాణ్ కు హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది పెద్ద కష్టమేమీ కాదు, తన టాలెంటుతో నిలబడటమే ఇపుడు సవాల్.