ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ కాళోజీ పురస్కారం 2022ను అందుకున్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 108 వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హరగోపాల్‌కు మంత్రులు మహమూద్అలీ, శ్రీనివాస్‌గౌడ్ ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ, ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురు గౌరీశంకర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు గొప్ప కవి అని పేర్కొన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం అనందంగా ఉందని అన్నారు. కాళోజీ నారాయణరావును సీఎం కేసీఆర్ ఎంతో అభిమానిస్తారని వెల్లడించారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ, వరంగల్‌లోని కళాక్షేత్రానికి కాళోజీ నారాయణరావు పేరు పెట్టిందని చెప్పారు. కాళోజీ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును శ్రీ రామోజు హరగోపాల్‌కు ఇవ్వడం అనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కాళోజీ అవార్డు అందుకున్న శ్రీరామోజు హరగోపాల్‌ను అభినందించారు. హరగోపాల్ సాహిత్య, చారిత్రక సేవను ఈ సందర్భంగా కొనియాడారు. కాళోజీ నారాయణరావు తెలుగు, ఉర్దూ భాషల్లో సాహిత్య సేవచేశారన్నారు. పుటుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని ఎలుగెత్తి చాటిన కాళోజీ ఎంతో గొప్ప కవి అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
సామాన్య మానవుడి తరఫున పోరాటం చేసిన ప్రజా వకీలు కాళోజీ నారాయణరావు అని పేర్కొన్నారు. అందుకే కాళోజీని ప్రజాకవిగా కీర్తించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ ప్రస్తావన లేకుండా ఏ సభ, ఏ ఉపన్యాసం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ఆయన గౌరవార్థం వరంగల్‌లో కాళోజీ పేరిట ఆడిటోరియం నిర్మిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.