” కలిసుంటే కలదు సుఖం “.. కాంగ్రెస్ కొత్త ఫార్ములా !

40
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి చేపట్టిన తరువాత నుంచి ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ పార్టీలోని సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా సీనియర్స్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా పార్టీ కార్యకలాపాలు జరుపుతారనే విమర్శ ఉంది. ఇక హస్తం పార్టీలో నేతలంతా ఎవరికి వారు ఎడమొఖం పెడమొఖంగా ఉండడంతో పార్టీ కూడా బలహీన పడుతూ వచ్చింది.

ఏ స్థాయిలో బలహీన పడిందంటే.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండే మునుగోడులో సైతం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. దీంతో రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా చర్చనీయాంశంగానే ఉంటుంది. అయితే వీరి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు హస్తం హైకమాండ్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం కనిపించలేదు. దాంతో ముందు రోజుల్లోనైనా సీనియర్స్ రేవంత్ రెడ్డితో కలిసే ఛాన్స్ ఉందా ? వీరి మధ్య ఆధిపత్య వివాదం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటనే ప్రశ్న తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రశ్నలన్నీకి చెక్ పెడుతూ అనూహ్యంగా పార్టీలోని సీనియర్స్ మరియు రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read: వారంలో ఇళ్ల పట్టాల పంపిణీ…

తాజాగా కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి వాళ్ళు పాల్గొన్నారు. అంతేకాకుండా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళు సడన్ గా రేవంత్ తో దోస్త్ మేరా దోస్త్ అనేలా కలిసిపోవడంతో ఆ పార్టీ క్యాడర్ లో నయా జోష్ కనిపిస్తున్నప్పటికి..నేతల మధ్య దూరం నివురుగప్పిన నిప్పుల ఉందనేది కొందరి వాదన. ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో వారి మధ్య ఉండే విబేదాలు అలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని గ్రహించిన నేతలు ప్రస్తుతం స్నేహగీతం అలపిస్తున్నారనేది విశ్లేషకుల మాట. మరి ఈ స్నేహ బంధం ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

Also Read: KTR:పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

- Advertisement -