పాపం ఎన్ని సార్లు ఏడ్చిందో ఆ గోదారమ్మ..తల మీదే ఉండి తెలంగాణ తలరాతను మార్చలేకపోతున్నానని.. ఎంతమందిని వేడుకుందో.. ఇంకెంతమందిని బతిలాడిందో తెలంగాణంకు తనను తీసుకెళ్లమని… ఒక్కరంటే ఒక్కరు కూడా..ఆఖరికి సొంత బిడ్డలు కూడా ఆ తల్లి బాధని పట్టించుకోలేదు..బీళ్లు నోళ్లు తెరిచి విలయతాండవం చేస్తుంటే కండ్ల ముందు బిడ్డలు కాటికెళ్తుంటే నిస్సహాయస్ధితిలో వలవల ఏడ్చుకుంటూ ఓ తెలంగాణ క్షమించంటూ వేడుకుంటూ కింది తరలిపోయింది.
ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ పల్లెలో ఏ గడప దట్టిన వినిపించిన పాటలు..గోదారి గోదారి పారేటి గోదారి..చుట్టు నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి ఈ భూమి..మాది తెలంగాణ భూమి. తలపున పారుతుంది గోదారి..మా చేను మా చెలక ఏడారి…ఇలాంటి పాటలెన్నో తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బాణంలా నిలిచాయి. తెలంగాణ గొసను ప్రపంచానికి వెలుగెత్తి చాటాయి.
ఈ నేపథ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే గోదావరి, కృష్ణా నదు ల్లో మనకున్న నీటి వాటాలను పూర్తిగా వినియోగించుకోవడమే ఏకైక మార్గంగా భావించారు కేసీఆర్. ఇందులో భాగంగానే కోటి ఎకరాలకు సాగునీరిచ్చేలా తెలంగాణ సమగ్ర జలవిధానాన్ని ఆవిష్కరించారు. స్వయంగా తానే ఇంజినీర్‌గా మారి రాత్రింబవళ్లు చర్చోపచర్చలతో సమగ్ర ప్రణాళికలను స్వయంగా రూపొందించారు
గోదావరి నది ద్వారా మనకు వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలంటే గోదావరిపై విరివిగా బ్యారేజీలు నిర్మించడమే మార్గమని భావించారు కేసీఆర్. గోదావరి వరదలు వచ్చినప్పుడు మన బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేసుకోవాలి. గోదావరిలో నీటి లభ్యత లేకుంటే ప్రాణహిత నదీ జలాలను గోదావరిలోకి మళ్లించుకోవాలి. ఇదీ ప్రభుత్వ వ్యూహం. ఇందులోనుంచి పురుడు పోసుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీడు బారిన పొలాలు పచ్చబడే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేస్తు ముందుకుసాగుతున్నారు. ఇకపై వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే రైతన్నలకు వరప్రదయినిగా తెలంగాణకు జీవధారగా మారనుంది కాళేశ్వరం. నదికే నీళ్ళనిచ్చే జీవనదిగా మారనుంది కాళేశ్వరం . 1832 కిలోమీటర్‌ల పొడవునా, 190 టీఎంసీల గోదావరి జలాలను ఎతిు పోస్తూ … 20 జిల్లాలకు ఉపయోగపడే లా డిజైన్ అయి 37లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు.
ఒక అద్భుతం జరగబోతున్నదని ముందే ఎవరూ చెప్పలేరు. అద్భుతం జరిగిన తర్వాత దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కళ్లారా చూసినవారు మాత్రం కాళేశ్వరప్రాజెక్టు సాగునీటి చరిత్రలోనే ఒక మహా అద్భుతాన్నిఆవిష్కరించబోతున్నదని ముందే గుండె మీద చెయ్యివేసి చెప్పగలరు.
అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తాజాగా మే 19న ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి నది నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడం అంటే తెలంగాణ ప్రాంతానికి నదినే తరలిస్తున్నట్లు భావించాలన్నారు. వచ్చే జూలై నుండి 2 టీఎంసీల నీటిని మళ్లించడం శుభపరిణామం అన్నారు. కాళేశ్వం ప్రాజెక్టు పూర్తిచేయడం ఎంత ముఖ్యమో ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయిన్‌టెనెన్స్ అంతే ముఖ్యమని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయడానికి కృషిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులను,ప్రతి ఒక్క కార్మికుడికి కృతజ్ఞతలు తెలిపారు.
సో ఏ కాలమైనా రైతులు వర్షాల కోసం నింగిని చూసే పనిలేదు. తెలంగాణ గ్రామీణ సంక్షభాన్ని పారదోలి వ్యవసాయాన్ని పండగలా మార్చే వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే సాక్షాత్కారం కాబోతుంది.