తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు : ప్రశ్నలు – విమర్శలు – వక్రీకరణలు – వివరణలు’’ ‘‘ సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం’’ పుస్తకాలను తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా మాజీమంత్రి టి.హరీశ్ రావు, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరవుతుండగా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సభాధ్యక్షత వహిస్తారని వారు వివరించారు.
విశిష్ట అతిథులుగా జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్, అంబేద్కర్ వర్సిటీ మాజీ విసీ కె.సీతారామారావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు జి.దేవీ ప్రసాదరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, రిటైర్డు ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టి.వెంకటేశం, సీనియర్ జర్నలిస్టు పి. వేణుగోపాల స్వామి పాల్గొంటారని తెలిపారు.
విజయానంద్, సందీప్, పవన్ ఉమాపతి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. తెలంగాణ సాగునీటిరంగంలో పదేండ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన తప్పనిసరి అవసరం, సందర్భం ఉన్నందునే తెలంగాణ వికాస సమితి బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులందరూ ఈ పుస్తకావిష్కరణ సభకు హాజరై విజయవంతం చేయాలని ఎర్రోజు శ్రీనివాస్ కోరారు.
Also Read:బరువు తగ్గాలనుందా..అయితే మీకోసమే!

