టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 60 ఏండ్లపాటు చిత్రపరిశ్రమకు సేవలందించిన కైకాల.. 1935, జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. మొత్తం 777 సినిమాల్లో నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడు, ఘటోత్కచుడి ప్రాత్రల్లో మెప్పించారు. ఒక దశలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరానిక చిత్రాల్లో రాణించిన ఏకైక నటుడిగా గుర్తింపు పొందారు.
కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. వయోభారంతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కైకాల సత్యనారాయణ ఒకప్పుడు రమా ఫిలింస్ అనే బ్యానర్‌తో సినిమాలను కూడా నిర్మించారు. కైకాల సత్యనారాయణ తర్వాత ఆయన వారసుడు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కైకాల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌కు ఆయన భౌతికకాయం తరలించనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.