షమీని ఎందుకు పక్కనపెట్టారు?

7
- Advertisement -

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీని న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై వివాదం మొదలైంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడికి జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. షమీని ఎందుకు పక్కనపెడుతున్నారో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మరోవైపు షమీ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటర్లకు ఊరటనిచ్చే విషయమని వ్యాఖ్యానించాడు.

న్యూజిలాండ్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్లలో షమీకి చోటు దక్కలేదు. వన్డేలు, టెస్టులతో పాటు టీ20 జట్టులోనూ అతడిని ఎంపిక చేయలేదు. దీంతో అతడి అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సెలెక్టర్ల నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

గత రంజీ ట్రోఫీ సీజన్‌లో బెంగాల్ తరఫున ఆడిన షమీ ఏడు మ్యాచ్‌ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లోనూ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంత మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ జాతీయ జట్టుకు ఎందుకు ఎంపిక చేయడం లేదో వివరించాలని కైఫ్ కోరాడు.

షమీ ఎంపిక విషయంలో పారదర్శకత అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అతడు రంజీ మ్యాచ్‌లు ఆడుతూ వికెట్లు తీస్తున్నాడని, తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటున్నాడని పేర్కొన్నాడు. అయినప్పటికీ అవకాశాలు ఎందుకు రావడం లేదో బీసీసీఐ బయటకు వచ్చి వివరించాలని సూచించాడు.

షమీ ఎక్కువసేపు బౌలింగ్ చేయలేడనే ప్రచారంపైనా కైఫ్ స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టుల్లో పరిమిత ఓవర్ల స్పెల్స్ వేస్తూ మధ్యలో విశ్రాంతి తీసుకుంటాడని గుర్తుచేశాడు. కాబట్టి షమీ విషయంలోనూ అసలు సమస్య ఏమిటో స్పష్టంగా చెప్పాలని కోరాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కైఫ్ గుర్తుచేశాడు. ధర్మశాల మ్యాచ్‌తో పాటు ముంబైలో జరిగిన సెమీఫైనల్‌లోనూ అతడి ప్రదర్శన భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాడు.

Also Read:జనవరి 12 విడుదల..అప్‌డేట్

షమీ భారత జట్టులో లేడని తెలిస్తే న్యూజిలాండ్ బ్యాటర్లు ఊపిరి పీల్చుకుంటారని కైఫ్ వ్యాఖ్యానించాడు. కివీస్‌పై షమీకి ఉన్న మంచి రికార్డు భారత జట్టుకు ఎంతో ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు.

- Advertisement -