ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాదలి’. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా అనగనగా సినిమా పతాకంపై పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమలో ఫీల్ ఎప్పుడూ కొత్తదే… అందుకే తెలిసిన కథైనా ఆసక్తిగా చూసేలా చేయొచ్చు. అలాంటి కథనే నమ్ముకుని పట్టాభి కూడా తొలి అడుగులోనే ఓ ప్రేమ కథని ఎంచుకొన్నాడు. మరి ఈ దర్శకుడి ప్రేమకథ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
బాంధవి ఓ డాక్టర్. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అయితే తన తండ్రి బిజినెస్ లో చేసిన మోసం వలన తనకు వచ్చే సంబంధాలు అన్నీ చెడిపోతుండడంతో తనకు పెళ్లి కావటం లేదు అని భాధపడుతుంటుంది. తన భర్తను తానే చూసుకోవాలనే ఉద్దేశంతో కార్తికేయను ఒక రెస్టారెంట్ లో చూసి ఇష్టపడుతుంది. అయితే కార్తీకేయ మనస్తత్వంతో విసుగుచెందిన బాంధవి క్రాంతి(సాయిరోనక్)అనే మరో అబ్బాయిని ఇష్టపడుతుంది. బాగా రిచ్ అయిన క్రాంతి కాస్త కోపిష్టి. బాంధవి కోసం కోపాన్ని కూడా వదులుకుంటాడు. ఇంతలో సీన్‌లోకి కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు.. దీంతో కథ ఎలాంటి మలుపు తిరిగింది…?బాంధవిని ఎవరు పెళ్లి చేసుకున్నారు…?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సంగీతం, నిర్మాణ విలువలు,సినిమాటోగ్రఫీ,నటులు. హీరోలిద్దరు బాగా నటించారు. హరీష్ అందంగా కనిపించాడు. నటనలో వంక పెట్టడానికి ఏం లేదు. సుదర్శన్ కాస్త నవ్వించాడు. హీరోయిన్ పాత్రలో పూజ ఓకే అనిపిస్తుందంతే. ఆమె హావభావాలు మరీ అంత గొప్పగా ఏం లేవు. పైగా లిప్ సింక్ ఏమాత్రం కుదర్లేదు. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సినిమా కలర్‌ఫుల్‌గా కనిపించింది. సంభాషణలు అక్కడక్కడ మెరిశాయి.
మైనస్ పాయింట్స్ :
మేజర్ మైనస్ పాయింట్స్ కథ, కథనం. కథ, కథనంలో మలుపులేం లేవు. సన్నివేశాలన్నీ నెమ్మదిగా నడుస్తుంటాయి. సంభాషణలూ మనం రోజు మాట్లాడుకునే మాటల్లా ఉండడంతో.. సినిమా చూస్తున్న భావన రాదు. సెకండాఫ్‌లో దర్శకుడు చెప్పడానికి ఏం మిగల్లేదు. కథని పతాక సన్నివేశాల వరకూ నడిపించడం కోసం పాటల్ని ఆశ్రయించాడు. చూసిన సన్నివేశమే మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్‌గా సాగాల్సిన పతాక సన్నివేశాలు సైతం తేలిపోతాయి.
సాంకేతిక విభాగం:
సినిమాకు సాంకేతికంగా మంచి మార్కులే పడ్డాయి. మంచి షాట్స్ ను అందించిన సినిమాటోగ్రఫీ వారిని తప్పక అభినందించాలి. సినిమాలోని పాటలు మంచి కలర్ ఫుల్ గా ఉన్నాయి. ప్రసన్, ప్రవీణ్, శ్యామ్ సంగీతం ఆకట్టుకొంది. వనమాలి చక్కటి సాహిత్యం అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టడానికి లేదు.
తీర్పు :
ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరి. ఇద్దరు స్నేహితుల్లో ఎవరిని ప్రియుడిగా ఎంచుకోవాలో తెలీక తికమక పడే ఓ అమ్మాయి కథ. అయితే ఈ తరహా కథలు చాలానే చూశాం. కథలోలానే సన్నివేశాల్లోనూ ఎలాంటి కొత్తదనం కనిపించదు. సినిమాటోగ్రఫీ, నటీనటులు, సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కొత్తదనం లేని కథ,కథనం మైనస్ పాయింట్స్. మొత్తంగా ఓ మామూలు ప్రేమకథగా నిలిచిపోయే సినిమా కాదలి.
విడుదల తేదీ: 16/06/2017
రేటింగ్ : 2.25/5
నటీనటులు :పూజ కె, హరీష్ కళ్యాణ్, సాయి రోనాక్, సుదర్శన్, భద్రం
సంగీతం : ప్రసన్ ప్రవీణ్ శ్యామ్
నిర్మాత : పట్టాభి
డైరెక్టర్ : పట్టాభి