వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం ప్రారంభమైన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి ప్రశంసలు లభించాయి. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై జరిగిన రెండు ప్యానెల్ చర్చల్లో నేటి కనీస అవసరాలను స్పృశిస్తూ కీలకోపన్యాసం చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో కూడిన ఈ రెండు ప్యానెళ్ళలో కేటీఆర్ మాత్రమే ఏకైక రాజకీయ ప్రతినిధి.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సహా పలువురు ఆర్థిక వేత్తలతో కూడిన ప్యానెల్ చర్చలో యాక్సెలెరేటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశంలోని మౌలిక వసతుల రంగంలో ఉన్న అవకాశాలను, తెలంగాణ కేంద్రంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రం ముందుకు వెళ్తాయని, ప్రజల జీవనవిధానంలో నాణ్యమైన వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటాయని, వారికి లభించే సేవలు నాణ్యంగా ఉంటాయని అన్నారు. అయితే ప్రభుత్వాల దగ్గర మూలధనం కొరత ఉన్న నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులతో ఈ రంగంలో వేగంగా అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు పారిశ్రామిక అనుకూల విధానాలను మంత్రి వివరించారు.
రాష్ట్రంలోని రోడ్డు నెట్‌వర్క్ విస్తరణపైన ప్రధానంగా నొక్కిచెప్తూ, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 1800 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారులను త్వరలోనే కేంద్ర సహకారంతో రెట్టింపు చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న 9 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచే లక్ష్యంలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పటికే కార్యాచరణ మొదలైందని, ఇందులో 15% సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా ఉంటుందని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిని పెట్టామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్ ఫండ్స్ తమలాంటి రాష్ట్రాలు చేపట్టే ప్రయత్నాలకు పెట్టుబడి సహకారం అందించాలని కోరారు.
ప్రభుత్వాలు కేవలం ఐదేండ్ల దృష్టితో పరిపాలన సాగించినంతకాలం మార్పు రాదని, ఆదర్శవంతమైన పాలసీలను రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఆలోచనా విధానానాలకు అంకురార్పణ చేయడం ద్వారానే ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమమైన విధానాలను అవలంబించేందుకు రాష్ట్రం వెనుకాడలేదని అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెక్టోరల్ పాలసీలు, వివాదాల పరిష్కార యంత్రాంగం, ఎగ్జిట్ పాలసీ వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదని అన్నారు.
నాణ్యమైన మౌలిక సౌకర్యాలను కల్పించినట్లయితే ప్రజలకు ఉత్తమ సేవలు లభిస్తాయని, వీటిని అందుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జాతీయ రహదారులపైన టోల్‌ప్లాజా రుసుము, ఎయిర్‌పోర్టుల్లో డెవలప్‌మెంట్ ఫీజు లాంటి స్కీమ్‌లు విజయవంతమయ్యాయని గుర్తుచేశారు.
మధ్యాహ్నం జరిగిన రెండవ ప్యానెల్ చర్చలో డిజిటలైజింగ్ ఇండియా అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దకాలంగా ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న డిజిటల్ డివైడ్ అనే అంశంలో తెలంగాణ సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా ఉండబోతుందని అన్నారు. ఇప్పటికే రెండు లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, ప్రతి ఇంటిలో ఒక డిజిటల్ అక్షరాస్యులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలను, ఐటీ పరిజ్ఞాన ఆధారిత ఫలాలను అందిస్తామన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది పూర్తయితే ప్రభుత్వ సేవలు ప్రజలు సత్వరం అందడానికి ఆస్కారం ఉంటుందని, వేగం కూడా పెరుగుతుందని, పారదర్శకత చోటుచేసుకుంటుందని అన్నారు. డిజిటల్ పరిజ్ఞానం కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నామని, అందుకే త్రాగునీటితో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే బృహత్తర ఫైబర్ గ్రిడ్‌కు రూపకల్పన చేశామని తెలిపారు.
ఇ-గవర్నెన్స్ దాటి ఎం-గవర్నెన్స్ (మొబైల్) దిశగా ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నామని, తాము ఇటీవల ప్రారంభించిన ఎం-వ్యాలెట్‌ను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఈ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలిపారు. ప్రజలకు డిజిటల్ సేలు ఎంత ఎక్కువగా అందిస్తే ప్రజాస్వామ్యం అంతగా పరిఢవిల్లుతుందన్నది తమ ప్రభుత్వ నమ్మకం అని అన్నారు. ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రజల ఆకాంక్షలను , వారి అవసరాలను ప్రభుత్వం గతంలోకంటే ఎక్కువగా గుర్తిస్తూ ఉన్నదని, తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందని అన్నారు.