గల్ఫ్ దేశం ఒమన్ నుండి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ చేరిన వ్యక్తికి అర్థరాత్రి సైతం చేయూతనందించి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేలా చేశారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన దొనుపాల రవీందర్ ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఒమన్ దేశంలోని మస్కట్‌కు వెళ్లాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రవీందర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
అయితే రవీందర్ పరిస్థితిపై, అతని సహచరులు ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం అందించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఇండియన్ ఎంబసీ అధికారులు హైదరాబాద్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో రవీందర్ సోమవారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్‌కు సహాయం కోసం మాజీ ఎంపీ కవితను అభ్యర్థించారు అతని కుటుంబ సభ్యులు.. రవీందర్ చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు మాజీ ఎంపీ కవిత ఆదేశించారు. మాజీ ఎంపీ కవిత సూచన మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారుల సాయంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో రవీందర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రవీందర్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్యం అందించాల్సిందిగా వైద్యులను కోరారు. రాత్రి మొత్తం జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి బాధితుని వెంటే ఉన్నారు. అడిగిన వెంటనే స్పందించి, అర్థరాత్రి సైతం మానవత్వంతో సహాయం చేసిన మాజీ ఎంపీ కవితకు రవీందర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.