బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా..

206
scindia

మధ్య ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించిన సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు.

18 సంవత్సరాల పాటు కాం్రెస్‌కు సేవలందించిన సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పటివరకు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 15 నెలలకే అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. సీఎం పదవికి పోటీ పడిన తనకు పీసీసీ చీఫ్ పదవి, రాజ్యసభ సభ్యత్వం దక్కకుండా వ్యూహాలు పన్నిన సీనియర్ నేతలకు సింధియా తన నిర్ణయంతో షాకిచ్చారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు BSP సభ్యులు, ఒక SP ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. ఐతే కాంగ్రెస్‌కు 22 మంది ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పడంతో.. కమల్‌నాథ్ ప్రభుత్వం బలం 94కు తగ్గి, మైనార్టీలో పడింది. ఇక ఈ 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలం 129కు చేరుతుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, కమల్‌నాథ్‌ను గద్దె దింపాలని భావిస్తోంది కమల దళం.