వేదికపై జ్యోతిక వేదన..!

190
Jyothikas questions directors
Jyothikas questions directors
- Advertisement -

సినిమాల్లో హీరోయిన్లను తెరపై చూపిస్తున్న తీరుపై తమిళ నటుడు సూర్య భార్య, నటి జ్యోతిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దర్శకులపై సంచలన వ్యాఖ్యలతో పాటు సూచనలు కూడా చేసింది. జ్యోతిక ప్రధానమైన పాత్రగా ‘మగళిర్ మట్టుమ్’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించారు. ఈ వేదికపై జ్యోతిక మాట్లాడుతూ .. ఈ సినిమాలో తనకి లభించిన పాత్ర పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే ఈ మధ్యకాలంలో వస్తోన్న కొన్ని సినిమాలు స్త్రీలను కించపరిచేలా వుంటున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆయా రచయితలు, దర్శకులు నిజ జీవితంలో తమ తల్లి లేదా భార్య లేదా ప్రియురాలిని గుర్తు చేసుకుని పాత్రలు రాయాలని సూచించింది. హీరోయిన్లకు మంచి కాస్ట్యూమ్స్ ఇవ్వరని… హీరోయిన్లతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడం, సిగ్గులేకుండా హీరోల వెనుక పడటం వంటి సన్నివేశాలు చూడడానికి బాగుండవని విమర్శించింది. పెద్ద హీరోలతో సినిమాలు తీసే దర్శకులందరూ తమ కథల్లో హీరోయిన్లను గౌరవ ప్రదంగా చూపించాలని విజ్ఞప్తి చేసింది. దర్శక నిర్మాతలు .. హీరోలు ఈ విధానాన్ని ప్రోత్సహించకూడదని తెలిపింది.

హీరోలకు భారీగా అభిమానులు ఉంటారని, వారు చెప్పే డైలాగులు, సన్నివేశాల ప్రభావం యువతపై, ముఖ్యంగా అభిమానులపై చాలా ప్రభావం చూపుతాయని జ్యోతిక అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఒక హీరోకి నలుగురు హీరోయిన్లు ఉండేలా సినిమాలు తీస్తుంటే .. అదే స్ఫూర్తితో వారి అభిమానులు కూడా ముగ్గురు లేదా నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ కావాలనుకోరా? అని జ్యోతిక ప్రశ్నించింది. ఒక హీరోకి ఒక హీరోయిన్ చాలని, రెండో హీరోయిన్ అవసరం లేదని, ఈ విషయమై దర్శకులకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొంది.

- Advertisement -