పాఠశాలలకు చిన్నారులు ఉదయం ఏడు గంటలకే వెళ్తున్నప్పుడు మనమెందుకు ముందుగా పని ప్రారంభించకూడదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ (యూ యూ) లలిత్ అభిప్రాయపడ్డారు. నిర్ణీత కాలానికంటే ముందే ముగ్గురు న్యాయమూర్తులు ధర్మాసనం విధులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన్నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అముగ్గురిలో ఈయనకూడా ఒకరిగా ఉన్నారు. సాధారణంగా వారంలో ఐదు రోజుల పాటు కోర్టులు పనిచేస్తాయి. రోజు పని గంటలు ఉదయం పదిన్నరకు ప్రారంభమై సాయంత్రం నాలుగుకు ముగుస్తాయి. అందులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి గంట పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది.
ఈ రోజు ఉదయం 9.30 గంటలకు జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం కేసు విచారణను ప్రారంభించింది. వాస్తవంగా కోర్టు పని గంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ స్పందిస్తూ చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించలేరని ప్రశ్నించారు. కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని, సుదీర్ఘ విచారణలు అవసరం లేనప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు పని ప్రారంభించి పదకోండున్నర తర్వాత అర గంట విరామం తీసుకోవాలి అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకొవచ్చన్నారు.