భారత్ చేసింది సర్జికల్ దాడులు కాదు క్రాస్ బోర్డర్ ఫైరింగ్ అని ఓవైపు బుకాయిస్తూ.. భారత జవాన్ల మృతదేహాలంటూ మరోవైపు మార్ఫింగ్ చేసిన చిత్రాలను వాడుతూ పాక్ మీడియా దిగజారుడు కథనాలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ స్పందించారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.. అంటూ మీడియాతో అన్నారు. ఈ దాడులకు సంబంధించి భారత్ ఎలాంటి సాక్ష్యాలను బయటపెట్టలేదని పాక్ అనడంపై.. వేచి చూడండి అంటూ రాజ్‌నాథ్ బదులిచ్చారు. సర్జికల్ దాడులతో ప్రపంచానికంతటికి మన ఆర్మీ పరాక్రమమేంటో తెలిసిందని ఆయన అన్నారు. తమ మెరుపు దాడితో దేశం గర్వించేలా చేశారని జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై ఇండియన్ ఆర్మీ గట్టిగానే స్పందించింది. డ్రోన్ల సాయంతో తాము దాడులను చిత్రీకరించామని, పాక్ స్పందనను బట్టి వాటిని రిలీజ్ చేస్తామని చెప్పింది.
ఉగ్రమూకలపై తమ భూభాగంలో సర్జికల్ దాడులంటే తమకే నష్టమని భావించి అది కేవలం క్రాస్ బోర్డర్ ఫైరింగ్ మాత్రమేనని, ఇందులో ఇద్దరు సైనికులు చనిపోయారని చెప్పుకుంది. కానీ భారత ఆర్మీ మాత్రం తాము చేసింది కచ్చితంగా సర్జికల్ దాడులేనని, ముందే అన్ని ఆధారాలు కూడా సేకరించామని స్పష్టంచేసింది. పాకిస్థాన్ ఈ మాట అంటుందని తాము ముందే ఊహించినట్లు కూడా ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడ్డారని కూడా వెల్లడించింది. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ఫొటోలను విడుదల చేస్తామని ఆర్మీ వర్గాలు చెప్పాయి.