రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317జీవో వల్ల ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రోడ్డున పడ్డారు. తొలిగించిన 400 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ ఉపాధి కల్పిన కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 317 జీవో మరియు జోనల్ బదిలీలో భాగంగా గ్రేడ్ 1,2,3,4 పంచాయతి కార్యదర్శులు స్థాన చలనం అయ్యి… వివిధ జిల్లాలలో పోస్టింగ్ తీసుకోవడం ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతి కార్యదర్శుల పాలిట శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 400 మంది కార్యదర్శుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 మంది కార్యదర్శులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్ మరియు సంగారెడ్డి జిల్లాలలో సీనియర్లను నియమించడంతో… తమ బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయన్నారు. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని… వివాహ నిశ్చితార్థం కొంత మంది తాజాగా వివాహం కూడా చేసుకోగా అవి కాస్తా పెటాకులయ్యే విధంగా దపురించిందన్నారు. 2018లో రాసిన జూనియర్ పంచాయతి కార్యదర్శుల రాత పరీక్షలో ఉన్న మెరిట్ లిస్టు ఆధారంగా తమను ఉద్యోగంలో నియమించడం జరిగిందని… తమలో కొందరిని ఇప్పటికే జూనియర్ పంచాయతి కార్యదర్షిగా మార్చడంతో… ఆశలు పెట్టుకుని మరే ఉద్యోగ ప్రిపరేషన్ కూడా చేయకుండా, ప్రైవేటు ఉద్యోగాలు కూడా వదులుకొని వచ్చామని వాపోయారు. జోనల్ బదిలీ ప్రక్రియ సర్దుబాటు పూర్తి కాగానే ఖాళీలను సేకరించి తమను విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.