తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాల పంపిణీ

278
- Advertisement -

కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ చేయాలని తీర్పు చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్రకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను నాలుగు వారాల్లోగా ట్రైబ్యునల్‌ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 14కు వాయిదా వేసింది. 4 రాష్ట్రాలకు నీటిని కేటాయించాలన్న వాదనను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.

నాలుగు రాష్ట్రాలకు కలిపి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ట్రిబ్యునల్ ముందు, కోర్టుల ముందు తెలంగాణ రాష్ట్రం కొట్లాడుతున్నా పట్టించుకోని కేంద్రం… ట్రిబ్యునల్‌కు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితం చేయాలని అఫిడవిట్ ఇచ్చింది. దీనిని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగానే తేల్చింది. ట్రైబ్యునల్‌ గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ర్టానికి 811 టీఎంసీల కృష్ణా జలాలు దక్కాయి. ఇందులో ఆంధ్రప్రదేశకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నికర జలాలు కేటాయించింది. మరోవైపు ట్రిబ్యునల్ తుది తీర్పునకు అనుగుణంగా.. న్యాయపరమైన కార్యాచరణ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ అంశంపై ఇప్పటికే న్యాయవాదులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు.

బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇరిగేషన్ నిపుణులు శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలకే కృష్ణా జలాలను పంపిణీ చేయాలనటం నిరాశజనకమని….  ట్రైబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సూచించారు.

Krishna

- Advertisement -