రోజుకు 800 కేసులు..జడ్జీలు రోబోలా?

2
- Advertisement -

విపరీతమైన కేసుల భారం ఉన్న రాజ్యాంగ న్యాయస్థానాలలో న్యాయపరమైన ప్రక్రియలు ముగియడానికి చాలా సమయం పడుతుందనే నిజాన్ని అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది.ఒక్కో రోజు ఒక న్యాయమూర్తి ముందు 800కు పైగా కేసులు విచారణకు వస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం జడ్జీలు సూపర్ రోబోలు లేదా సూపర్ కంప్యూటర్లలా పనిచేయాలని ఆశిస్తున్నారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

జస్టిస్ క్షితిజ్ శైలేంద్ర మాట్లాడుతూ.. న్యాయపరమైన ప్రక్రియలు ముగిసి తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. అయితే కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే నెపంతో కోర్టు ఆదేశాలను బహిరంగంగా ధిక్కరించడానికి ఏ పక్షాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. చట్టం ఇలాంటి మితిమీరిన ధీమాను సహించదు అన్నారు. ఇటువంటి పరిస్థితులను అనుమతిస్తే న్యాయవ్యవస్థలో గందరగోళం…అరాచకం ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది.

మన అలహాబాద్ హైకోర్టు వంటి విపరీతమైన కేసుల భారం ఉన్న రాజ్యాంగ న్యాయస్థానాలలో…ప్రతి రోజు ప్రతి జడ్జీ ముందు 400, 500, 600 మరియు కొన్నిసార్లు 800 కంటే ఎక్కువ కేసులు విచారణకు వస్తుంటాయి. ఇక్కడ న్యాయ ప్రక్రియలు ముగియడానికి చాలా సమయం పడుతుంది అన్నారు. ఒక ఉపాధ్యాయుని జీతానికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించేటప్పుడు కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఘాజీపూర్ జిల్లా పాఠశాలల ఇన్‌స్పెక్టర్ 2022 ఏప్రిల్ 18న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమయ్యారు. అయితే ఆ కోర్టు ఉత్తర్వులపై ‘స్టే వెకేషన్’ (స్టే రద్దు) అప్లికేషన్ దాఖలు చేసినందున ఉత్తర్వులను అమలు చేయలేకపోయామని ప్రభుత్వం సమర్థించుకుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చే ఆదేశం కేవలం ఒక సలహా మాత్రమే కాదని, లేదా అనుకూలమైనప్పుడు చూసి వదిలేయడానికి అది ఒక అలంకార కాగితం కాదని కోర్టు పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు రాజ్యాంగం యొక్క పూర్తి అధికారాన్ని, చట్టబద్ధమైన నిబంధనలను కలిగి ఉంటాయి. కోర్టు ఆదేశాలను పాటించడం లేదా పాటించకపోవడం అనేది తమ ఇష్టానుసారమైన విషయంగా ఎప్పుడైతే లిటిగెంట్లు భావిస్తారో… అప్పుడే రాజ్యాంగ పాలన యొక్క పునాది క్షీణించడం ప్రారంభమవుతుంది అని కోర్టు పేర్కొంది.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

- Advertisement -