బిగ్‌బాస్ 2: రంగంలోకి సెలబ్రిటీలు?

215
Jr NTR's Big Boss 2 updates..!
- Advertisement -

తెలుగులో బిగ్ బాస్ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతూ వస్తుంది. ఇక ఎన్టీఆర్ కనిపించే శని,ఆది వారాల్లో అయితే అత్యధిక టిఆర్పీ రేటింగ్ లు సాధిస్తుంది.

పార్టిసిపెంట్ల విషయంలో ముందు ప్రేక్షకుల్లో నిరాశ వ్యక్తమైనా.. వారాంతాల్లో మినహాయిస్తే పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని.. హౌస్ మేట్స్ అనుకున్నంత స్థాయిలో ఎంటర్టైన్ చేయట్లేదని విమర్శలు వ్యక్తమైనా.. షో రేటింగ్స్ అయితే పడిపోలేదు.

‘బిగ్ బాస్’ మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. జూలై 16న ప్రారంభమైన ఈ షోలో బిగ్‌బాస్ టైటిల్ కోసం 14 మంది కన్టెస్టెంట్స్ పోటీ పడగా.. ఎనిమిదవ వారం వచ్చేసరికి ఏడుగురు కన్టెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో నవదీప్,ప్రిన్స్, హరితేజ, శివబాలాజీలు టైటిల్ రేస్‌లో ఉన్నారు. ఇప్పటికే 51 ఎపిసోడ్‌లను పూర్తి చేయడంతో మరో 19 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో రెండో సీజన్‌ను మొదలుపెట్టే పనిలో పడ్డారు షో నిర్వాహకులు.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం స్టార్ మాకు కలిసి రావడంతో సెకండ్ సీజన్‌కు కూడా జూనియర్ ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇప్పటికే ఈ విషయంపై చానల్ యాజమాన్యం ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఇక ‘బిగ్ బాస్ సెకండ్ సీజన్‌’లో పోటీదారులుగా ఎవరిని తీసుకోవాలనే విషయంపై దృష్టి పెట్టారు షో నిర్వాహకులు. బిగ్ బాస్‌ సీజన్‌లో జరిగిన పొరపాటు రిపీట్ కాకుండా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ఎన్టీఆర్ సైతం  షోలో కనీసం ఐదారుగురు సత్తా ఉన్న కంటెస్టంట్లు ఉండాలని .. బిగ్‌బాస్ నిర్వహకులకు సూచించినట్లు తెలుస్తోంది.

షో ఆసక్తికరంగా లేకపోతే గతంలో కొన్ని షోల మాదిరి నడిపించడం కష్టం అవుతుందని సలహా ఇచ్చారట. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో హైప్ ఉండే తారలను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్‌ 2 హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారేవరో తెలియాలంటే కొన్నిరోజులు వేచిచూడక తప్పదు.

- Advertisement -