టాలీవుడ్ లో ఈ జూనియర్ కి ఓ రేంజ్ ఉంది.. పేరు జూనియర్ ఎన్టీఆరే అయినా. నటనలో, పోలికల్లో.. వాక్చాతుర్యంలో సేమ్ టు సేమ్ సీనియర్ ఎన్టీఆర్ ని మరిపిస్తాడు. అయితే ఇప్పుడు హటాత్తుగా జూనియర్ కొత్త పార్టీ పెడుతున్నాడంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నవ భారత్ నేషనల్ పార్టీ’కి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఓ లేఖ నెట్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ రూమర్లపై జూ.ఎన్టీఆర్ తనదైనశైలిలో జవాబిచ్చేశాడు. ప్రస్తుతం ‘జైలవకుశ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్.. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట.
తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట. అంతేకాకుండా ఎవరూ ఈ వార్తలను పట్టించుకోవద్దని, వదిలేయాలని సూచించాడట. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదే ఉందని, తనకు ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేమీ లేదని అన్నాడట.
ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించాడట. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట. మొత్తంమీద తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో ఎన్టీఆర్ ఇలా చెక్ పెట్టేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాల అభిప్రాయం.