దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఆపేయండి- జూ.ఎన్టీఆర్

76
- Advertisement -

ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటనపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. ‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యమంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపానలకు నాంది పలుకుతుంది. అది తప్పు.. స్త్రీజాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అందించాలి.

అంతేకానీ, మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి, ఇదే రాబోయే తరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పుు. ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందినవాడినిగా మాట్లాడటం లేదు. ఈ మాటలు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమజ్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను..’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు.

- Advertisement -