రేవంత్ సర్కారుపై జర్నలిస్ట్ సంఘాల తిరుగుబాటు

6
- Advertisement -

రేవంత్‌రెడ్డి సర్కార్‌పై జర్నలిస్టు సంఘాలు తిరుగుబాటు చేశాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 252ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు భారీగా ఆందోళనకు దిగారు. కొత్త అక్రెడిటేషన్ మార్గదర్శకాలు మీడియా స్వేచ్ఛను కట్టడి చేసేలా ఉన్నాయని, ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలు, అక్రమాలను వెలికి తీస్తున్న మీడియా సంస్థలనే లక్ష్యంగా ఈ జీవో రూపొందించారంటూ జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి.

ఈ నేపథ్యంలో లక్డికపూల్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లనీయకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జర్నలిస్టులపై అనవసర బలప్రయోగం చేయడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

జర్నలిస్టుల వాదన ప్రకారం, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన 252 జీవో అమలైతే దాదాపు 10 వేల అక్రెడిటేషన్ కార్డులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోత విధించడం ద్వారా జర్నలిస్టుల జీవనోపాధిపై దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

ప్రభుత్వం తక్షణమే జీవో 252ను వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వం, జర్నలిస్టుల గొంతు నొక్కే విధానాలను అవలంబిస్తోందని ఆరోపించాయి. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సంఘాలు స్పష్టం చేశాయి.

Also Read:  ‘శ్రీనివాస మంగాపురం’..మొదటి షెడ్యూల్

 

- Advertisement -