విజయ్‌మాల్యా ..భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడిన కేసులో నిందితుడు. అయితే ఇటీవలే భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు అరెస్టయిన మూడు గంటల్లోనే ఈ లిక్కర్ రారాజుకు బెయిల్ మంజూరైన విషయం కూడా విధితమే.
అయితే, ఆయనను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. త్వరలో భారత్‌కు మాల్యాను అప్పగించే విషయంపై అక్కడి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే సీబీఐకి చెందిన టాప్ ఆఫీసర్స్ బృందం లండన్‌కు చేరుకుంది. ఈ బృందంలో సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా కూడా ఉన్నారు. విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అక్కడి ప్రాసిక్యూటర్లతో చర్చలు జరుపనుంది ఆస్తానా బృందం.
మాల్యా భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ఇంటెలిజెన్స్ బృందంతో కూడా చర్చలు జరుపుతుంది ఆస్తానా బృందం. అయితే తనను భారత్‌కు అప్పగించకుండా రాజకీయంగా మాల్యా పన్నాగాలు పన్నే అవకాశం ఉండటంతో ఆయన ఆలోచనలకు చెక్ పెట్టే దిశగా కూడా సీబీఐ బృందం యోచిస్తోంది.
భారత ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ ఆరోపిస్తున్నట్లుగా తనది క్రిమినల్ కేసు కాదని సివిల్ కేసని కేవలం రాజకీయ కక్షతోనే తనపై చర్యలకు దిగుతున్నారని చెప్పి మళ్లీ తప్పించుకునే ప్రయత్నం కూడా మాల్యా చేసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా అక్కడి న్యాయశాఖతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది సీబీఐ బృందం. ఇదిలాఉండగా విజయ్ మాల్యా కేసు ఈ నెల 17న మరోసారి లండన్ కోర్టులో విచారణకు రానుంది.