బ్రాహ్మణ యువతకు జాబ్ మేళా..

224
- Advertisement -

బ్రాహ్మణులకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు బ్రాహ్మణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఈ నెల 26 ఆదివారం యూసుఫ్ గూడ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మైక్రొ, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (NI-MSME) లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ డా.కె.వి.రమణాచారి తెలిపారు.

గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.కె.వి.రమణాచారి మాట్లాడుతూ జిహెచ్ యంసి పరిధిలో గల బ్రాహ్మణ యువతీ,యువకులు జాబ్ మేళాలో పాల్గొనడం కోసం WWW.JOBMELA.ONLINE/TBSP/REGISTRATION వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ జాబ్ మేళాలో TATA, BUSINESS SUPPORT SERVICES, KARVY, HINDUJA GLOBAL SOLUTIONS, BAJAJ CAPITAL, FLIP CART,UREKA FORBES, IT,SOFTWARE,BPO,HEALTH CARE BANKING & FINANCIAL INSTITUTE లాంటి 40 నుండి 50 కంపెనీలు పాల్గొంటాయని, ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ, పీజి ఇంజనీరింగ్ అర్హత గల నిరుద్యోగులందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆదివారం ఉదయం 9.00 గం.ల నుండి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని ముందుగా ఆన్ లైన్ లో రిజిష్ట్రర్ చేసుకోలేని వారు కూడా ప్రత్యక్షంగా వచ్చి జాబ్ మేళాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బ్రాహ్మణ నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్ధుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని,వయోపరిమితి కూడా విధించడం లేదని వారు తెలిపారు. ఫైలెట్ ప్రాతిపాదికన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తరువాత జిల్లాలలో కూడా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జాబ్ మేళా కు వచ్చే అభ్యర్ధులు తమ అర్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. జిహెచ్ యంసితో పాటు సమీప జిల్లాలోని అభ్యర్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రాష్ట్ర ప్రభుత్వం 2016-17 లో100 కోట్లు కేటాయించిందని, 2017-18 బడ్జెట్ లో కూడా మరో 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులు రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమం కోసం వినియోగిస్తామని వారు తెలిపారు.

రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కోసం హైదరాబాదు గోపనపల్లిలో 6 ఎకరాల స్ధలం ప్రభుత్వం కేటాయించిందని ఈ భూమిని తమ కార్పొరేషన్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నదని డా.కె.వి.రమణాచారి తెలిపారు. 10 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన బ్రాహ్మణ సంఘ భవనానికి వచ్చే ఏప్రిల్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు భూమి పూజ చేస్తారని తెలిపారు. జిల్లా స్ధాయిలో కూడా భవనాలు నిర్మించాలనే ఆలోచన ఉందని కనీసం ఒక ఎకరం స్ధలం ఉండాలని,వీటికి 75 శాతం ఆర్ధిక సహకారం అందిస్తామన్నారు. కళ్యాణ మండపం,ప్రవచనాల కార్యక్రమం, కోచింగ్ సెంటర్, తదితర అవసరాలకోసం ఈ భవానాలను వినియోగించుకోవచ్చని అన్నారు.

బ్రాహ్మణుల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సర్వేద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మ ణుల వివరాలను సేకరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె.వేణుగోపాలచారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ ఛైర్మన్ శ్రీ జ్వాలా నరసింహారావు, సభ్యురాలు శ్రీమతి సులోచన సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -