జియోలో గూగుల్ 33వేల కోట్ల పెట్టుబడులు‌ : ముఖేశ్ అంబానీ

47
ambani

వాటాదారులకిచ్చిన మాట ప్రకారం జియోని రుణరహిత కంపెనీగా మార్చామని తెలిపారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన అంబానీ దేశంలో అత్యధిక జీఎస్టీని చెల్లించామని తెలిపారు.

రిలయన్స్ జియోలో గూగుల్ పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. కరోనా ప్రభావంతో తొలిసారి వర్చువల్ మీటింగ్‌ జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్‌ కు జియో 5జీని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక రంగంలో వేగంగా విస్తరించామన్నారు. డిజిటల్ అనుసందానానికి వేదికగా జియోని తీసుకొచ్చామని చెప్పారు.

అన్ని రంగాల్లో వృద్ధి సాధించామని తెలిపారు ముఖేష్ అంబానీ. దేశంలో అత్యధికంగా 69372 కోట్ల జీఎస్టీ చెల్లించామని తెలిపారు. జియో 5జీ సాంకేతికతను దేశంలో అభివృద్ధి చేశామని…త్వరలోనే దేశమంతా విస్తరిస్తామని తెలిపారు.ఆధునిక ఫీచర్స్ తో జియో గ్లాస్ తీసుకొచ్చినట్లు తెలిపారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ 33,737 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7శాతం వాటాను గూగుల్‌ కొనుగోలు చేయనుందని ప్రకటించారు. జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్‌ కొనసాగుతుందని చెప్పారు. రిలయన్స్‌లోకి రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చినట్లు ముకేశ్‌ వెల్లడించారు.