రిలయన్స్ జియో సేవలతో టెలికాం మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ వినియోగదారులకు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా తన కస్టమర్లందరికీ 4జీ డేటా, వాయిస్ కాల్స్‌ను అందరికీ ఉచితంగా ఇస్తున్న రిలయన్స్ జియో… ఈ ఉచిత సేవలు డిసెంబర్ 31 వరకు అందచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రాయ్ నిబంధనల మేరకు జియో ఉచిత సేవలు 90 రోజులకే పరిమితమని, ఇవి డిసెంబర్ 3తో ముగిసిపోతాయని ట్రాయ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జియో ఈ విషయాన్ని కూడా ధ్రువీకరించింది.
తాజాగా అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జియో సర్వీస్‌పై కస్టమర్లు పూర్తిగా సంతృప్తి వ్యక్తంచేయనంత వరకు డబ్బు వసూలు చేయడం సరికాదని జియో ప్రణాళిక విభాగం భావిస్తున్నట్లు బిజినెస్ పత్రిక మింట్ కథనం వెలువరించింది. దీంతో ఫ్రీ ఆఫర్‌ను మరో మూడు నెలలు పొడిగించే దిశగా జియో ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతానికైతే డిసెంబర్ 31 డెడ్‌లైన్ అని.. అయితే ప్రస్తుతం ఉన్న కస్టమర్లు తమ సర్వీస్‌తో సంతృప్తి చెందకపోతే.. దీనికి పొడిగిస్తామని కూడా జియో ప్రారంభం సందర్భంగా తాము చెప్పినట్లు కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎయిర్‌టెల్, ఐడియా, ఒడాఫోన్లు తమకు సహకరించడం లేదని, దీనివల్ల తాము కస్టమర్లకు ఇవ్వాలనుకుంటున్న పూర్తి సేవలను అందించలేకపోతున్నామని ట్రాయ్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. పైగా, డిసెంబర్ తర్వాత కూడా ఉచిత సేవలను కొనసాగించడానికి తమకు ట్రాయ్ అనుమతి కూడా అవసరం లేదని చెప్పారు.
దీంతో, 2017 మార్చ్ వరకు జియో ఉచిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యర్థి కంపెనీలు తమకు సహకరించే వరకు ఫ్రీ ఆఫర్‌తో ఒత్తిడి పెంచుతూనే ఉంటామని జియో చెప్పకనే చెప్పింది.