బీఆర్ఎస్ అంటే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం అని, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రజలను హింసించే భూతాల దేవి అని, ఆ పార్టీ రాక్షస నీతి తప్ప రాజనీతి లేని కొరివి దెయ్యాల కొంప అని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను దెయ్యాల రాజ్య సమితి అంటూ చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీనే జనం దేశం పొలిమేరలు దాటేలా కొడుతున్నా డిల్లీలో రాహుల్ గాంధీకి, గల్లీలో రేవంత్ రెడ్డి కి ఏ మాత్రం బుద్ధి రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు.కేసీఆర్ తెలంగాణ సూర్యుడు…బీఆర్ఎస్ దెయ్యం కాదు, అగ్గి పుట్టించే ఉద్యమ భాస్వరం.
గులాబీ సైన్యం తెలంగాణ రక్షణకవచం. తెలంగాణ కు పట్టిన అసలుసిసలైన కొరివి దెయ్యం రేవంత్. కేసీఆర్ తో గొక్కోకు, తెలంగాణ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కుతావు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ తో పెట్టుకుంటే ఏమవుద్దో నీ గురువునడిగి తెలుసుకో అన్నారు.
నోరు అదుపులో పెట్టుకో.. కేసీఆర్ ను తిట్టి తెలంగాణ ద్రోహిగా మిగలకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనంతా దేవుళ్ళపై ఓట్లు, కేసీఆర్ కు తిట్లు తప్ప ఏమన్నా ఉందా? అని ఆయన ఎద్దేవా చేశారు. తిట్లు, అబద్ధాలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పొలిటిక్స్ చేయడం మానుకోవాలని జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
Also Read:రోషన్ కనకాల…’మోగ్లీ 2025′ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి

