జగిత్యాల కాంగ్రెస్‌లో ఆరని మంట!

9
- Advertisement -

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సంజయ్ కుమార్ రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. “అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా ఆయనకే స్పష్టత లేదు. అలాంటి వ్యక్తి నీతులు మాట్లాడటం హాస్యాస్పదం” అని విమర్శించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సీఎం ను కలవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఇతర పార్టీల విషయాల్లో మాట్లాడే ముందు తన పరిధి తెలుసుకోవాలని సూచించారు.

తన రాజకీయ ప్రస్థానం గురించి కూడా జీవన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. “1983 ఎన్నికల్లో టీడీపీ నాకు అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా జగిత్యాల ప్రజలకు సేవ చేశాను. ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు నాయుడు ఆధిపత్యంతో విభేదించి నాదెండ్ల వర్గంలో చేరాను” అని గుర్తుచేశారు. రాజకీయ విలువలకు కట్టుబడి తానే స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

ఎమ్మెల్యే సంజయ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, అర్థంలేని వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని జీవన్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, అవి నిజాలపై ఆధారపడి ఉండాలన్నారు.

- Advertisement -