కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఇవాళ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మెజార్టీ లేకపోయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వానించడంపై కాంగ్రెస్,జేడీఎస్ తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను బీజేపీ తుంగలో తొక్కిందని….అడ్డదారిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఒకడుగు ముందుకేసిన జేడీఎస్ చీఫ్ కేంద్రంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు,బెంగాల్ సీఎం మమతా,బీఎస్పీ అధినేత్రి మాయావతి,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను మద్దతివ్వాల్సింగా కోరారు. ఇందుకోసం మాజీ ప్రధాని దేవేగౌడను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు.
దేశంలో బీజేపీ చర్యలు మితిమీరిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని ఆ పార్టీ హత్య చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలపై ఈడీతో దాడులు చేయిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. పవిత్రమైన రాజ్ భవన్‌ను తన పార్టీ కార్యాలయంగా బీజేపీ మార్చేసిందన్నారు.
మరోవైపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం విధానసభ ముందు ఆందోళనకు దిగారు కాంగ్రెస్,జేడీఎస్ నేతలు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవేగౌడ సైతం పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం అనంతరం కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం యడ్యూరప్ప రేపు లేదా ఎల్లుండి బలపరీక్ష ఉంటుందని అందరూ సిద్దంగా ఉండాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.