ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం విశాఖ విమానాశ్రయంలో వీరంగం సృష్టించారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కడానికి జేసి దివాకర్ రెడ్డి ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. అయితే ఆయన సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో..బోర్డింగ్ పాసును జారీ చేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జేసీ అక్కడి సిబ్బందిని బండ బూతులు తిట్టారు. ఈ పాసులను జారీ చేసే ప్రింటర్ ను విసురుగా కిందికి తోసివేసి హంగామా సృష్టించారు.
జేసీ తీరుపై ఆగ్రహించిన విమానయాన సంస్థలు తమ సంస్థల విమానాల్లో ప్రయాణించకూడదని ఆంక్షలు పెట్టాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు తొలుత ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియాతో పాటు, స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్‌లు కూడా నిషేధాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించాయి. అయితే కాలపరిమితిని వెల్లడించలేదు.
గురువారం గొడవ విషయం తెలుసుకున్న విమానాశ్రయ డైరెక్టర్ జి.ప్రకాష్‌రెడ్డి, ఇండిగో విమానయాన సంస్థ అధికారులు అక్కడి వచ్చారు. ఎంపీకి సర్దిచెప్పి బోర్డింగ్ పాస్ ఇప్పించారు. అనంతరం ఆయన అదే విమానంలో బయలుదేరి వెళ్లారు. ఇదే విమానంలో తెలుగుదేశానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ప్రయాణించడం గమనార్హం.
పాస్ ఇచ్చేందుకు సమయం మించిపోయిందంటూ తమ సిబ్బంది మర్యాదపూర్వకంగానే చెప్పారని, తరువాతి విమానంలో పంపిస్తామని చెప్పినా ఆయన ఆగ్రహించారని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది కూడా గన్నవరంలో విమానం తప్పిపోయినందుకు అక్కడి ఎయిర్ ఇండియా సిబ్బందిపై జేసీ దివాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు.