తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి కె.రంగారావుపై ఆయన 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత నడుమ ఈ ఎన్నికలు ముగిసాయి. టీవోఏ ఎన్నికల్లో 84 ఓట్లకు గాను మొత్తం 81 ఓట్లు పోలయ్యాయి. జయేశ్ రంజన్‌కు 46 ఓట్లు రాగా, రంగారావుకు 33 మాత్రమే వచ్చాయి. జయేష్ రంజన్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు మహ్మద్ అలీ, ప్రేమ్‌రాజ్, సరల్ తల్వార్, వేణుగోపాలచారి సైతం గెలుపొందారు.
అయితే, క్రాస్‌ఓటింగ్ జరుగడంతో మిగిలిన పదవులకు అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం 26 పోస్టుల్లో అధ్యక్ష పదవి సహా మరో నాలుగు స్థానాల్లో జయేశ్ రంజన్ ప్యానెల్ విజయం సాధించింది. టీవోఏ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన జయేశ్ ప్యానెల్ అభ్యర్థి, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు ఏ.జగన్‌మోహన్ రావు విజయం తథ్యమని ముందు నుంచి అందరూ అంచనా వేసినా… ఆయన రెండు ఓట్ల స్వల్ప తేడాతో జగదీశ్వర్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.