అనారోగ్యానికి గురైన తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. గత 15 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయను పరామర్శించేందుకు వచ్చారు.పావుగంట పాటు ఆయన ఆస్పత్రి లోపలే ఉన్నారు. అయితే, ఎవరినీ నేరుగా జయలలిత వద్దకు వెళ్లనివ్వకపోతుండటంతో.. అసలు ఆయన ఆమెను చూశారా, లేదా వైద్యులతోనే మాట్లాడి వచ్చేశారా అన్న విషయం మాత్రం తెలియరావడం లేదు.
సోనియాగాంధీ తరపున జయను పరామర్శించేందుకు చెన్నైకు వచ్చానని తెలిపారు. జయలలితకు కోలుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థించినట్లు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో అరగంట పాటు గడిపిన రాహుల్ జయ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జయలలిత ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా పలు రకాల ఆందోళనలు, అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అపోలో వైద్యులతో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యబృందం, లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బాలే తదితరులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రి ‘అమ్మ ఆస్పత్రి’గా మారిపోయింది. అంతేగాక ఆమె క్షేమం కోరుతూ వేలాదిమంది కార్యకర్తలు నిర్వహిస్తున్న పూజలు, పునస్కారాలతో ‘సర్వమత ప్రార్థనా మందిరం’ను తలపిస్తోంది. అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, జయ వీరాభిమానులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు భగవంతుడ్ని ప్రార్థ్ధిస్తూ ఆమె క్షేమం కోసం చేస్తున్న ప్రార్థనలతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది.