దీపావళికి ముందే జయలలిత డిశ్చార్జ్‌..?

191
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న వారికి ఒక శుభవార్త. జయలలిత వేగంగా కోలుకోవడమే కాదు.. ఆమె మాట్లాడుతున్నదని తాజాగా అన్నాడీఎంకే సీనియర్‌ నేత సీ పొన్నైయన్‌ వెల్లడించారు. ఇక జయలలిత ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈనెల 27వ తేదిన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. ఆనారోగ్యంతో చికిత్స పొందుతున్న జయలలిత త్వరగా కోలుకోవాలని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హోమాలు చేస్తున్నారు.

లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ ఎయిమ్స్ వైద్యులకు జయ ఆరోగ్యంపై వివరించారు. డాక్టర్ రిచర్డ్ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు సింగపూర్ కు చెందిన ఫిజియోథెరఫీ వైద్యులు జయలలితకు చికిత్స చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు సింగపూర్ కు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు జయకు చికిత్స అందిస్తారని సమాచారం.

jayalalithaa

మరోవైపు, తమిళనాడులో పాలన కుంటుపడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జయలలిత మంత్రివర్గ శాఖలను స్వీకరించిన పన్నీర్ సెల్వం, కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. కావేరి నదీ జలాల వివాదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అటు నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉండటంతో అన్నాడీఎంకే వర్గాలు చురుగ్గా పని చేస్తున్నాయి.

తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత గత 20రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఈ నెల 10వ తేదీ తర్వాత మెడికల్‌ బులిటెన్‌ విడుదల చేయలేదు. దీంతో జయలలిత ఆరోగ్యం విషమించిందనే వదంతులు వచ్చాయి. మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, ఆమెకు అందిస్తున్న చికిత్స విషయంలో గోప్యత పాటించడంతో ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జయలలిత ఆరోగ్యంపై మెడికల్‌ బులిటెన్లు విడుదల చేయకపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమ్మ వేగంగా కోలుకుంటున్నారని పొన్నియన్‌ తెలిపారు.

- Advertisement -