ఉత్కంఠకు తెర..

243
- Advertisement -

జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కళ్లు తెరిచారు. ఈ విషయం వెంటనే బయటకు పొక్కి, ఆసుపత్రి ముందు అమ్మ అభిమానులు, రోజుల తరబడి వేచి చూస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది. ఈ వార్తలను వైద్యులు సైతం ధ్రువీకరించారు. ఆమె కళ్లు తెరచి చూసిందని వైద్యులు స్పష్టం చేయడంతో, ఆమె మరింత త్వరగా కోలుకోవాలని ఓ వైపు ప్రత్యేక పూజలు చేస్తూనే, మరోవైపు సంబరాలను మొదలు పెట్టారు అమ్మ అభిమానులు. దీంతో అపోలో ఆసుపత్రి ఎదుట సందడి పెరిగింది.

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జయలలిత ఆహారం తీసుకుంటున్నారని, లిక్విడ్ ఫుడ్‌గా కాకుండా.. సాలిడ్ ఐటమ్స్ తీసుకునే స్థాయికి ఆమె ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో డీ హైడ్రేషన్‌.. జ్వరంతో చేరిన జయలలిత.. మూడు వారాల పాటు చికిత్స పొందుతున్నారు. ఉన్నత వైద్య బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. జయలలిత కళ్లు తెరిచారన్న వార్తల నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై నేడు వైద్యులు విడుదల చేసే బులెటిన్ పై ఆసక్తి నెలకొంది.

జయలలితను పరామర్శించేందుకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు వస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సందర్శించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ భార్య నీతా అంబానీ కూడా జయ కోసం అపోలోకు వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి, కాసేపు అక్కడే ఉండి వెళ్లిపోయారు. ప్రధాని మోడీ జయలలితను పరామర్శించనున్నారని సమాచారం. అయితే ఆమెను చూసేందుకు ఎవరినీ లోపలికి వదలడం లేదు. వచ్చిన వారు ఎంతటి వారైనా ఆసుపత్రికి రావడం వైద్యులతో మాట్లాడటం వెళ్లడమే జరుగుతోంది.

- Advertisement -