అమర్‌సింగ్ ముమ్మాటికీ నా గాడ్ ఫాదరే అని స్పష్టం చేశారు సినీ నటి జయప్రద. రాఖి కట్టినా కొంతమంది మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగడతారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్ లైన్ లిటరేచర్ ఉత్సవంలో రచయిత రామ్ కమల్‌తో జరిగిన సంభాషణలో జయప్రద ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2009 నాటి ఘటనను తలుచుకుని బాధపడ్డారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని దీనికి కారణం తన మార్ఫ్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ కావడమే అని వివరించారు.
సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నానని తెలిపారు. పురుషాధ్యిక ప్రపంచంలో రాజకీయాల్లో ఒక మహిళ రాణించడం చాలా కష్టమైన పని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆజం ఖాన్‌కు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా చెప్పలేకపోయానని జయప్రద వాపోయారు. నేను నోరు విప్పి ఉంటే ఆ మరుక్షణమే తనను చంపేసి ఉండేవారని అన్నారు.
తాను ఆస్పత్రిపాలైన సందర్భంలో ఎవరూ అండగా నిలవలేదని, డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అనంతరం అమర్‌సింగ్ మాత్రమే చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎస్పీలో నెంబర్ 2గా వెలుగొందిన అమర్ సింగ్ యూపీ రాజకీయాలను శాసించారు. ఈ క్రమంలో అమర్‌తో పాటు ఎస్పీలో కీలకంగా వ్యవహరించిన జయప్రద ఎంపీగా గెలిచారు. అయితే తర్వాత ఎస్పీలో తలెత్తిన సంక్షోభం కారణంగా ఆ పార్టీని విభేదించి ఆమర్ సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి.