కూటమికి ‘జనసేన గ్లాసు’ దెబ్బ!

21
- Advertisement -

ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంచితే జనసేన పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు సమస్య కూటమిని ఇబ్బంది పెడుతోంది. మొదటి నుంచి కూడా జనసేన పార్టీ సింబల్ గా గాజు గ్లాసును ప్రచారంలో ఉంచుతు వచ్చింది పార్టీ అధిష్టానం. అయితే పార్టీ స్పపించి పదేళ్ళు గడిచిన అధికార హోదా లేకపోవడంతో గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఈ అంశమే ఇప్పుడు జనసేన పార్టీని అలాగే కూటమిని కలవర పెడుతోంది. దీనిపై జెఎస్పి‌ కోర్టును ఆశ్రయించినప్పటికి ఫలితం లేకపోయింది. .

తాజాగా ఆయా నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దాదాపు 50కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. ముఖ్యంగా మంగళగిరి, కుప్పం, రాప్తాడు, టెక్కలి, అద్దంకి, పర్చారు, మాచర్ల వంటి స్థానాల్లో గాజు గ్లాసుపై స్వతంత్రులు పోటీ చేయనున్నారు. కూటమిలో భాగంగా ఈ నియోజక వర్గాల్లో టీడీపీ, బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి. దీంతో జనసేన పార్టీకి సంబంధించిన గాజుగ్లాసు కూడా ఈవిఏం లలో కనిపిస్తే ప్రజలు గందరగోళానికి లోనూ కావడం ఖాయమని, ఓట్లలో చీలిక ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఈ ఎన్నికల్లో జనసేన కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ 144, బీజేపీ 10 చోట్ల పోటీ చేయనున్నాయి. జనసేన పోటీలో లేని స్థానాలు చాలానే ఉండడంతో ఆ స్థానాల్లో గాజు గ్లాసుపై స్వతంత్రులు పోటీ చేస్తే కూటమికి భారీగానే నష్టం జరగనుంది. అసలే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చీలిక ఏర్పడేలా జనసేన గుర్తు ( గాజు గ్లాసు ) కూటమిని కలవర పెడుతోంది. మరి పరిణామం నుంచి కూటమి ఎలా బయట పడుతుందో చూడాలి.

Also Read:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..

- Advertisement -