అసెంబ్లీ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. వైసీపీ తమ మ్యానిఫెస్టోను దైవ గ్రంథంలో పోల్చిందనీ, ఇందులో నిజంగా అన్నీ ప్రజా సంక్షేమ పథకాలే ఉన్నాయని తెలిపారు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ప్రజలకు ఉపయోగపడే పథకాలే ఉన్నాయన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అన్నారు. బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశారని చెప్పారు.
జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు వైసీపీకి ఓటు వేశారని అందుకు అనుగుణంగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారని చెప్పారు. అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కల్యాణ్ చెప్పలేదు.. ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతుంటే సపోర్ట్ చేయమని చెప్పారే తప్ప, వాళ్లు అధికార పక్షం కాబట్టి వాళ్లు ఏం చేసినా వ్యతిరేకించమని తనకు చెప్పలేదన్నారు.
తండ్రి వైఎస్ తరహాలో ఆయన కుమారుడు, సీఎం జగన్ రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే జగన్ ను ప్రశంసించడంతో వైసిపి ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. రాపాక వరప్రసాద్ ను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు బుద్ది తెచ్చుకోవాన్నారు.