రాష్ట్రంలో జర్నలిస్టుల సంకేమానికి ప్రభుత్వం ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టుల కూడా సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా చనిపోయన జర్నలిస్టుల కుటుంబాలను కలుసుకుని, వారికి సహాయం అందిస్తానని సిఎం చెప్పారు. ప్రగతిభవన్లో మంగళవారం జర్నలిస్టుల సంకేమంపై సిఎం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణలో చర్యలు తీసుకుంటున్నాం. గత రెండు బడ్జెట్లలో రూ.10 కోట్ల చొప్పున ఇప్పటికే రూ. 20 కోట్లు కేటాయించాం. ఈ సారి బడ్జెట్లో కూడా మరో పది కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఈ డబ్బులతో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ కుటుంబాలకు ఐదేళ్ల వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తాం. పదవ తరగతిలోపు చదివే పిల్లలుంటే ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున సహాయం అందిస్తాం. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసిస్తే వారికి ఓవర్పీస్ స్కాలర్ షిప్ పధకం వర్తింపచేస్తాం. జర్నలిస్టులు విదేశాలకు వెళ్లి అధ్యయనం చేస్తే తగిన సహాయం అందచేస్తాం” అని సిఎం ప్రకటించారు. హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు గుర్తించి, అందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్ కు సిఎం అప్పగించారు.
ప్రగతి భవన్లో భాగంగా నిర్మించిన జనహిత లో వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుసుకుని వారితో చర్చించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న ప్రారంభించనున్నారు. ఆ రోజు కేసీఆర్ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. జనహితలో మొదటి సమావేశం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా విధాన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.