పవన్‌కి అంత సీనుందా..!

216
pawan janasena
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఓ వైపు తెలంగాణలో వార్‌ వన్‌సైడే కాగా ఏపీలో మాత్రం కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ,వైసీపీ మధ్య హోరాహోరి పోరు సాగుతుందని ప్రచారం సాగుతుండగా జనసేనాని పవన్‌ సైతం తన సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం జనసేనాని పవన్‌ కన్ను తెలంగాణపై పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నాడో లేక లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆతృతనో తెలియదు వరుసగా పార్లమెంటరీ కమిటీలను వేస్తూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటివరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కమిటీలను వేశారు పవన్‌.

త్వరలోనే మిగితా నియోజకవర్గాల్లో కమిటీలను వేసి అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నారు పవన్‌. అయితే ఎక్కడా సంస్థాగతంగా పట్టులేని పవన్‌ లోక్‌ సభ ఎన్నికల్లో కమిటీలు వేయడం పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవడం లేదు. ఎందుకంటే జనసేన తెలంగాణ శాఖలో చెప్పుకోదగ్గ నేత ఎవరు లేరు. అసలు ఆ పార్టీకి జిల్లా స్ధాయి కమిటీల సంగతి పక్కనపెడితే కనీసం రాష్ట్ర కమిటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పవన్‌ పోటీచేస్తానని ప్రకటించడం ధైర్యంతో కూడుకున్న పనే.

ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమికి గట్టిగా బుద్ధిచెప్పిన కేసీఆర్, పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేశారు. కేసీఆర్ దెబ్బకు బీజేపీ కూడా పత్తాలేకుండా పోయింది. ఇక సర్వేలన్నీ టీఆర్ఎస్ 16,ఎంఐఎం ఒక లోక్ సభ స్ధానాన్ని గెలుస్తుందని చెబుతున్న సమయంలో పవన్‌ ఓ వైపు ఏపీ రాజకీయాలు మరోవైపు తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించడంపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. రెండు పడవలపై ప్రయాణించడం సరికాదని ఏం సాధిద్దామని పవన్‌ తెలంగాణ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారో అర్థంకావడం లేదని చెబుతున్నారు.

జనసేన ఏపీ నేతల నుండి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.తెలంగాణలో కమిటీలు ప్రకటించడంపై ఉన్న శ్రద్ధ, ఏపీ పార్టీ నిర్మాణంపై పెడితే బాగుంటుందని జనసైనికులు అంటున్నారు.

- Advertisement -