తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. విడుదలకు ఇంకా రెండు రోజులే గడువు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికెట్ అందకపోవడం ప్రధాన కారణంగా మారింది.
విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సమయంలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సెన్సార్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో విడుదల తేదీని కొనసాగించడం సాధ్యం కాదని భావించిన చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ మూవీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్‌కు సంబంధించిన అంశాలపై తక్షణ పరిష్కారం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని నిర్మాతలు తెలిపారు.
సినిమా విడుదలకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. విజయ్ అభిమానులు మాత్రం నిరాశ చెందుతున్నప్పటికీ, పూర్తి స్థాయి అనుమతులతోనే సినిమా విడుదల కావాలని ఆశిస్తున్నారు. ‘జన నాయగన్’ విడుదలపై అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Also Read:Nani:ది ప్యారడైజ్..ఫస్ట్ సింగిల్!

